Telangana: కేసీఆర్.. దమ్ముంటే యువత, రైతులు, అమరవీరుల కుటుంబాలను దత్తత తీసుకో!: రాహుల్ గాంధీ

  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ వచ్చింది
  • నల్లగొండను దత్తత తీసుకుంటానని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు
  • కోదాడ సభలో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ చీఫ్

నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం సాగిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రైతులు, మహిళలు, యువకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వ్యాఖ్యానించారు. ఇటీవల నల్లగొండ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటించిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పాట పాడుతారని ఎద్దేవా చేశారు. కోదాడలో ఈరోజు నిర్వహించిన మహాకూటమి బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

నిజంగా కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలోని రైతులను తొలుత దత్తత తీసుకోవాలనీ, వాళ్లు బలవన్మరణానికి పాల్పడకుండా కాపాడాలని సూచించారు. నిరుద్యోగ యువతను దత్తత తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఏకంగా 4,500 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీలకు రిజర్వేషన్లు, యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమైన కేసీఆర్.. బడా కాంట్రాక్టర్లకు మాత్రం భారీగా సాయపడ్డారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News