TRS: టీఆర్ఎస్ లో 65 శాతం అభ్యర్థులు గెలవడం కష్టమే.. సర్వేలోనూ అదే చెప్పాను!: లగడపాటి సంచలన వ్యాఖ్యలు

  • మహాకూటమికి ముందు టీఆర్ఎస్ కే ఛాన్స్
  • కానీ ఇప్పుడు పరిస్థితి మారింది
  • కేటీఆర్ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు

తెలంగాణ ఎన్నికల విషయంలో తాను నిర్వహించిన సర్వేలపై నేతలు ఎంతగా విమర్శించినా, దూషించినా తనకు అభ్యంతరం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. అయితే ఎవరో ఒత్తిడి చేయడంతో తాను సర్వే ఫలితాలను మార్చినట్లు కొందరు చెప్పడం సరికాదన్నారు. కేటీఆర్, తనకు మధ్య జరిగిన చర్చల విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనను ఈ ఏడాది సెప్టెంబర్ 16న సమీప బంధువుల ఇంట్లో కలుసుకున్నారని లగడపాటి అన్నారు. ఈ భేటీకి ముందు తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఓ మీడియా సంస్థ కోసం ఎన్నికల సర్వే చేసినట్లు తెలుసుకున్న కేటీఆర్ తనతో సమావేశం అయ్యారని తెలిపారు.

‘సర్వే మాకు చాలా అనుకూలంగా ఉందట కదా’ అని కేటీఆర్ చెప్పారన్నారు. వెంటనే తాను మాట్లాడుతూ..‘ఓ మీడియా సంస్థ కోసం మా సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. మీకు కాపీ కావాలంటే ఈ-మెయిల్ ఇవ్వండి. పంపిస్తా’ అని చెప్పానన్నారు. మరుసటి రోజు కేటీఆర్ కు తాను మెయిల్ పంపానని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ కు ఈసారి అనుకూలంగా ఉందని తమ టీమ్ నివేదిక సమర్పించిందన్నారు. అయితే ఈ సర్వే మహాకూటమి ఏర్పడకముందు జరిగిందన్నారు. ప్రస్తుతం 65 శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాను చెప్పానని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను నిలబెట్టి పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే పరిస్థితిని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయని వ్యాఖ్యానించారు.

TRS
Andhra Pradesh
Telangana
KTR
maha kutami
Telugudesam
Congress
survey
  • Loading...

More Telugu News