Telangana: ‘ఆంధ్రాలో వేలుపెడతాం’ అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నారా లోకేశ్!
- రేవంత్ అరెస్టు అప్రజాస్వామికం
- ఆంధ్రాలో కేటీఆర్ ప్రచారం చేసుకోవచ్చు
- తెలంగాణలో మహాకూటమి గెలుపు తథ్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారనీ, వచ్చే ఏడాది జరిగే ఆంధ్రా ఎన్నికల్లో తామూ వేలు పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందనీ, అక్రమ అరెస్టులు, వేధింపులు, రౌడీయిజం లేవన్నారు. కావాలనుకుంటే కేటీఆర్ ఆంధ్రాలోనూ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తెలంగాణ అభివృద్దిని అడ్డుకున్నారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, దళిత సామాజిక వర్గానికి 3 ఎకరాల భూమిని ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం.. ఇలా దేన్నీ చంద్రబాబు అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అభివృద్ది చేపట్టడం చేతకాక కేసీఆర్ ప్రభుత్వం తమపై అభాండాలు వేస్తోందన్నారు.
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమనీ, ఇలాంటి చర్యలను ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని మంత్రి తెలిపారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే రోజూ సచివాలయానికి వస్తానని కేసీఆర్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 11న వెలువడే ఫలితాల్లో మహాకూటమి(ప్రజా కూటమి) విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.