Andhra Pradesh: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. సీబీఐ సమ్మతి ఉత్తర్వుల రద్దు సబబేనన్న ధర్మాసనం!
- నిబంధనల మేరకే ప్రభుత్వ ఉత్తర్వులు
- కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు
- పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి కేసులను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు ఉన్న సమ్మతి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐని రాజకీయ ఆయుధంగా వాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించేలా హైకోర్టు స్పందించింది.
సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చట్టసమ్మతంగానే ఉందని హైకోర్టు తెలిపింది. వేర్వేరు కేసుల్లో కోర్టులు ఎలాంటి అవరోధం లేకుండా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సదరు స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.