jana sena: ప్రతి ఇంటి తలుపు తట్టండి... ‘జనసేన’ మేనిఫెస్టో, సిద్ధాంతాలు వివరించండి: పవన్ కల్యాణ్
- రేపు ఉదయం 11 గంటలకు ‘జనసేన తరంగం’
- శింగనమలలోని ఓ గ్రామం నుంచి ప్రారంభిస్తాం
- ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం
రేపు ఉదయం 11 గంటలకు ‘జనసేన తరంగం’ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతపురం నుంచి ‘ఫేస్ బుక్’ లైవ్ ద్వారా ఇందుకు సంబంధించిన విషయాలను పవన్ పంచుకున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నామని, ఇందులో తాను పాల్గొంటున్నట్టు తెలిపారు.
జనసేన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పవన్ పేర్కొన్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టి మేనిఫెస్టోలోని అంశాలను, ఏడు సిద్ధాంతాలను వివరించాలని ఈ మేరకు జనసైనికులకు ఆయన పిలుపు నిచ్చారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, యువత, పెద్దలు పాల్గొని, నవతరం రాజకీయాలను తెలియజెప్పాలని కోరారు.
రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. జనసైనికులు వెళ్లదలచుకున్న ఇంటి తలుపు తట్టి పార్టీ గురించి వివరిస్తూ ‘ఫేస్ బుక్’ లైవ్ పెట్టాలని, తాను కూడా కొందరితో మాట్లాడతానని పవన్ పేర్కొన్నారు.