Andhra Pradesh: విజయనగరంలో అవినీతి చేప.. రూ.20 కోట్లు కూడబెట్టిన ప్రభుత్వ ఉద్యోగి!
- విజయనగరంలో ఏఎంవీఐగా పనిచేస్తున్న రవికుమార్
- భారీగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదు
- హైదరాబాద్, విశాఖ, విజయనగరంలో సోదాలు
విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్(ఎంవీఐ) కొత్తపల్లి రవికుమార్ ఇళ్లు, కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ లోని రవికుమార్ బంధువుల ఇళ్లలో బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ దాడుల్లో రవికుమార్ కు విజయనగరంలో 7 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించామన్నారు.
గాజువాకలోని శ్రీహరిపురం, అరిలోవలో ఖరీదైన ఇళ్లు ఆయనకు ఉన్నాయని తెలిపారు. అలాగే విశాఖ బీచ్ రోడ్డులో మరో రెండు ఖరీదైన భవనాలను రవికుమార్ నిర్మిస్తున్నారని వెల్లడించారు. అలాగే రవికుమార్ కు చెందిన మూడు బ్యాంకు లాకర్లను గుర్తించామనీ, వాటిలో తనిఖీల కోసం మరో బృందం బయలుదేరిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల మొత్తం విలువ రూ.20 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విజయనగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.