Hi-tech thief: హైటెక్ దొంగ.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ధనవంతుల ఇళ్లు వెతుకుతాడు.. విమానాల్లో వచ్చి దోచుకెళ్తాడు!

  • పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తలు
  • దొంగతనానికి విమానంలో.. సొత్తుతో రైలులో
  • దొంగ చెప్పింది విని షాకైన పోలీసులు

అతడో ప్రొఫెషనల్ దొంగ. గూగుల్ మ్యాప్స్ ద్వారా ధనవంతుల ఇళ్లు వెతుకుతాడు. ఓ ఇల్లును ఎంచుకుంటాడు. విమానంలో అక్కడికి చేరుకుంటాడు. ఇంటిని దోచుకుని తిరుగు ప్రయాణంలో రైలెక్కుతాడు. చివరికి పాపం పండి హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయాడు.

 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న నుంగంబాక్కంకు చెందిన వైద్యుడి ఇంటిని దోచుకున్న తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. దోచుకున్న తర్వాత చిన్న ఆధారం కూడా లేకుండా జాగ్రత్త పడే దొంగను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, చెన్నైలో ధనికులు నివసించే పలు ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలన్నీ ఒకేలా ఉండడంతో ఒకే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల వల్లువూర్ కొట్టమ్‌లో కూడా ఇటువంటి దొంగతనాలే జరిగాయి.

ఇటీవల హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాతియా రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. నుంగబాక్కం, వల్లువూర్ కొట్టంలో జరిగిన దొంగతనాలు కూడా తాను చేసినవేనని అంగీకరించాడు. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు ఈసారి విస్తుపోయే విషయాలు చెప్పాడు.

చెన్నైలోని ధనికులు నివాసముండే ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుకుతానని, అనంతరం విమానంలో చెన్నై వెళ్లి ముందే టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుంటానని చెప్పాడు. ధనవంతులు రోజులో ఎక్కువ సమయం బయటే గడుపుతారని, కాబట్టి తన పని సులభం అయ్యేదని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, వెంట తీసుకెళ్లిన పనిముట్లతో తాళాలు తెరిచి లోపలికి ప్రవేశిస్తానని వివరించాడు. అయితే, ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడతానని పేర్కొన్నాడు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేసినా తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడతానని తెలిపాడు. ఆ తర్వాత దోచుకున్న సొత్తుతో తన సొంతూరికి రైలులో చేరుకుంటానని సాతియా రెడ్డి వివరించాడు.

  • Loading...

More Telugu News