Vizag: ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటూ పట్టాలు దాటుతూ... వైజాగ్ యువ డ్యాన్సర్ దుర్మరణం!
- డ్యాన్సులు చేస్తూ జీవించే అనిల్
- స్నేహితులను కలిసేందుకు వెళ్లి మృత్యువాత
- కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటూ, ఏమరుపాటుగా రైలు పట్టాలు దాటుతున్న ఓ యువ డ్యాన్సర్, రైలు కింద పడి దుర్మరణం పాలైన ఘటన విశాఖపట్నంలో జరిగింది. వేగంగా వస్తున్న రైలును గమనించకుండా అతను ట్రాక్ దాటే ప్రయత్నం చేయడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు.
నగర పరిధిలోని బుచ్చిరాజుపాలెం, రెడ్డివీధికి చెందిన ఉప్పాడ అనిల్ (22), నృత్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న ఉదయం తన స్నేహితులను కలిసేందుకు వెళుతూ రైల్వేట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు. రైలు తగలడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.