Telangana: తెలంగాణ ప్రజలకు తెలివి లేదని కేసీఆర్ చెబుతున్నారు.. ఓట్లేసిన వాళ్లనే అవమానిస్తున్నారు!: రాహుల్ గాంధీ
- కేసీఆర్ వైఫల్యంతో రైతుల ఆత్మహత్యలు
- రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం
- గద్వాల బహిరంగ సభలో రాహుల్ వెల్లడి
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, గిరిజనుల హక్కుల కోసం జాతీయ భూసేకరణ చట్టాన్ని యూపీఏ హయాంలో తీసుకొచ్చామని గుర్తుచేశారు. అయితే కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. తమ హక్కుల కోసం, గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమించిన రైతులపై తెలంగాణలో లాఠీలు విరిగాయనీ, కాల్పులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
ప్రధాని మోదీ దేశంలోని 15 మంది ధనికులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారనీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల రుణాలను మాఫీ చేస్తుందని రాహుల్ తెలిపారు. భూసేకరణ చేపడితే రైతులకు మార్కెట్ ధర కంటే నాలుగురెట్లు అధికంగా ఇవ్వాల్సి వస్తుందన్నారు. ప్రజలకు తెలివితేటలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రాహుల్ అన్నారు. ఇదే ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారనీ, కానీ ఆయన మాత్రం ప్రజలను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ వెంటనే రైతులకు, యువతకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే తమకు ఏ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలకు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్న కేసీఆర్ కనీసం ఐదు వేల ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజలు ఇల్లు లేకుండా అల్లాడుతుంటే కేసీఆర్ మాత్రం రూ.300 కోట్ల విలువైన ఇంట్లో (ప్రగతి భవన్ లో) విశ్రాంతి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. నిజంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుండేవారని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతీయువకులకు రూ.3 వేలు జీవన భృతిని అందజేస్తామని పేర్కొన్నారు.