Telangana: కిరణ్ కుమార్ రెడ్డి నన్ను బెదిరిస్తుంటే వెనుక కూర్చున్న పొన్నాల కిస..కిస.. అంటూ నవ్వాడు!: హరీశ్ రావు
- వైఎస్ ఈటల రాజేందర్ ను అవమానించారు
- ‘పులిచింతల’కు ఉత్తమ్ జై కొట్టారు
- మీడియా సమావేశం నిర్వహించిన హరీశ్
చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్ మెంట్ చేసినంత మాత్రాన ఆయన చేసిన పనులను ప్రజలు మర్చిపోరని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 2014లో అమరావతిలో ప్రమాణస్వీకారం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘తెలుగుజాతిని కలపగలిగే సత్తా టీడీపీకే ఉంది’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
బెర్లిన్ గోడ కూలి రెండు జర్మనీలు ఒక్కటైనట్లు ఏపీ, తెలంగాణ తిరిగి కలుస్తాయని కాంగ్రెస్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు. ఇప్పుడు అదే రెండు పార్టీలు తెలంగాణలో అధికారం కోసం ఒక్కటయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
‘హరీశ్.. నీ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో’ అని కిరణ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇస్తే.. వెనక కూర్చున్న అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య కిస.. కిస .. అంటూ నవ్వారని మండిపడ్డారు. తెలంగాణకు నష్టం చేకూర్చే పులిచింతల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి కట్టించారని ఆరోపించారు.
రాజేంద్ర (ఈటల రాజేందర్) ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్? అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ నేతను అవమానించారని దుయ్యబట్టారు. ‘తెలంగాణ ఇప్పుడు అవసరం లేదు. అభివృద్ధి జరిగాకే రాష్ట్రం తీసుకుంటాం’ అని అప్పటి నేత భట్టి విక్రమార్క సోనియా గాంధీకి లేఖ రాశారన్నారు. ఇలాంటి నేతలు అధికారం కోసం నేడు దిగజారి ఏకమయ్యారని మండిపడ్డారు.