prattipadu: రావెల నిష్క్రమణతో క్యాడర్‌ ను కాపాడుకునే పనిలో అధికార టీడీపీ

  • మంత్రి ప్రత్తిపాటి, గల్లా అరుణకుమారిలు పార్టీ వర్గాలతో భేటీ
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • త్వరలోనే కొత్త ఇన్‌చార్జిని నియమించనున్నట్లు వెల్లడి

మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించి జనసేన తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ క్యాడర్‌ చేజారిపోకుండా అధికార పార్టీ యత్నాలు ప్రారంభించింది. రావెల నిష్క్రమణ వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ నాయకురాలు గల్లా అరుణకుమారిలు నియోకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో హుటాహుటిన సమావేశమయ్యారు.

ఎమ్మెల్యే పార్టీ వీడినా, క్యాడర్‌ ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా ఉండడం అభినందనీయమని, మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు తమ మనసులో మాట నాయకుల వద్ద వెల్లడించారు. ఎవరో కొత్తవారిని ఇన్‌చార్జిగా తమ మీద రుద్దవద్దని, తమలోనే కష్టపడి పనిచేస్తున్న ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గం ఇన్‌చార్జిని నియమించడం జరుగుతుందని చెప్పారు. ఈలోగా ఏ ఇబ్బంది ఉన్నా తనతోపాటు, మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

  • Loading...

More Telugu News