KCR: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతా.. ప్రధాని పదవిని కోరుకోవడం లేదు!: కేసీఆర్

  • దేశాన్ని పాలించేదెవరో ప్రజలే నిర్ణయిస్తారు
  • జేపీ స్థాపించిన జనతాపార్టీని ప్రజలే గెలిపించారు
  • దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నా

భారత్ ను ఎవరు పాలించాలో నిర్ణయించేది దేశ ప్రజలేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ స్థాపించిన జనతా పార్టీ ఘనవిజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రాల్లోని విద్య, వ్యవసాయంపై కేంద్రం అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ తెలిపారు. అందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు.

తాను ప్రధాని పదవిని కోరుకోవడం లేదనీ, దేశ రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాననీ, ఫెడరల్ ఫ్రంట్ ను కూడా విజయవంతం చేస్తానని అన్నారు. తాను పోరాటయోధుడిననీ, ముష్టివాడిని కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News