Hyderabad: అమీర్ పేట హోటల్స్ లో ఏపీ టీడీపీ బ్యాచ్... టాస్క్ ఫోర్స్ దాడులతో దొరికిన డబ్బు, నలుగురి అరెస్ట్!
- డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు
- సనత్ నగర్ ప్రాంతంలో కొందరిని దిగ్బంధించిన తలసాని అనుచరులు
- హోటల్స్ పై ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు
- డబ్బు, కారు స్వాధీనం, నలుగురి అరెస్ట్
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట ప్రాంతంలోని పలు హోటళ్లలో మకాం వేసిన ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సనత్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, హోటళ్లన్నింటిపైనా దాడులకు దిగారు. సనత్ నగర్ లో కొందరు టీడీపీ కార్యకర్తలను దిగ్బంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు, ఆందోళనకు దిగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలసాని అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు.
దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు కలసి టీడీపీ కార్యకర్తలు మూడు హోటళ్లలో మకాం వేశారని గుర్తించి ఆయా హోటల్స్ పై దాడులు చేశారు. వారి గదులన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టీడీపీ కార్యకర్తలు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సరైన లెక్కలు చూపించని రూ. 4.74 లక్షల డబ్బు, ఓ కారును సీజ్ చేశారు. అమీర్ పేటతో పాటు కూకట్ పల్లి ప్రాంతంలోని హోటల్స్ లో ఎవరెవరు ఉన్నారన్న విషయమై ఈ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి.