She Teams: అమ్మాయిని పదేపదే వేధిస్తున్న ఆకతాయిని, 7 గంటల పాటు వెంటాడి పట్టిన హైదరాబాద్ పోలీసులు!
- బంజారాహిల్స్ లో అమ్మాయికి వేధింపులు
- షీ టీమ్స్ ను ఆశ్రయించిన బాధితురాలు
- సాక్ష్యాలతో సహా నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీల తాట తీయడంలో షీటీమ్స్ పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. తమకు ఫిర్యాదు అందిన గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి ఆపై చర్యలు ఉంటున్నాయి. తాజాగా, ఓ ఐటీ ఉద్యోగినిని నెలల తరబడి వేధిస్తున్న యువకుడిని, వలేసి సాక్ష్యాలతో సహా పట్టుకుని కటకటాల వెనక్కు పంపించారు పోలీసులు.
బంజారాహిల్స్, పింఛన్ ఆఫీస్ బస్టాప్ నుంచి మాదాపూర్ కు వెళ్లే ఓ యువతిని (22), మహేష్ అనే యువకుడు వేధిస్తుండగా, అతని వేధింపులను భరించలేని ఆమె షీ టీమ్స్ ను ఆశ్రయించింది. అతని బైక్ నంబర్ ఫోటోను పంపించాలని పోలీసులు సూచించగా, దాన్ని పంపింది. ఆపై 7 గంటల పాటు అతన్ని వెంబడించి, రహస్యంగా వీడియో తీస్తూ, మాట్లాడిన మాటలను రికార్డు చేస్తూ సాక్ష్యాలను సంపాదించింది షీ టీమ్స్ బృందం.
గతంలో ఓ శిక్షణా సంస్థలో కలసి చదువుకున్న చనువుతో, ఆమెకు మంచి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న మహేష్, నిత్యమూ ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. బస్సు బదులు తన బైక్ ఎక్కాలని వేధించేవాడు. ఎక్కకుంటే యాక్సిడెంట్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో అతని బైక్ నంబర్ 'టీఎస్ 13 ఈఈ 1019' బాధితురాలు వాట్సాప్ చేసింది. దీంతో నిన్న ఉదయం 10 గంటల సమయంలో షీ టీమ్స్ పింఛన్ ఆఫీస్ వద్ద మకాం వేసింది. బాధితురాలితో మహేష్ మాట్లాడటాన్ని చిత్రీకరించింది. ఆపై అతన్ని వెంబడించింది.
మధ్యాహ్నం అబీడ్స్ లోని ఓ హోటల్ కు వెళ్లిన అతను, తన స్నేహితులతో కలసి మాట్లాడుతూ, తనను ఓ అమ్మాయి లవ్ చేస్తోందని, ఇద్దరమూ కలసి రిసార్టుకు వెళుతున్నామని చెప్పాడు. ఆపై సాయంత్రం నాలుగు గంటల సమయంలో పంజాగుట్ట నుంచి బాధితురాలికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఆ సమయంలో పక్కనే మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఆపై అతన్ని అరెస్ట్ చేసి, కోర్టుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి నేరుగా చంచల్ గూడ జైలుకు తరలించారు.