Chandrababu: తెలంగాణకు నేను రావడానికి కారణమిదే: చంద్రబాబు వివరణ

  • ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే.. నాలుగేళ్లకే చాప చుట్టేశారు
  • తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
  • వాజ్ పేయితో పోరాడి శంషాబాద్ ఎయిర్ పోర్టును తెచ్చా

తెలుగుదేశం పార్టీని కేసీఆర్ విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కేసీఆర్ చెప్పాలని ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచే కేసీఆర్ వచ్చారని, తనతో పాటు పని చేశారని చెప్పారు. అందరినీ బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లు పాలించమని అధికారాన్ని ఇస్తే... నాలుగేళ్లకే చాప చుట్టేశారని అన్నారు. ఐదేళ్లు పాలించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉంటే తాను ఆనందపడేవాడినని చెప్పారు.

తమ వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందని... రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని తెలిపారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయలేకపోయారని అన్నారు. ఏం తమ్ముళ్లూ, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. ఏమీ చేయలేని కేసీఆర్ తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సైబరాబాద్ మాదిరే అమరావతిని కూడా ప్రపంచ పటంలో పెడతానని చెప్పారు. వాజ్ పేయితో పోరాడి శంషాబాద్ ఎయిర్ పోర్టును తెచ్చానని, ఎన్నో ఐటీ కంపెనీలను హైదరాబాదుకు రప్పించానని చెప్పారు. రాజేంద్రనగర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీలతో సతమతమయ్యారని అన్నారు. సీబీఐ, ఐటీ దాడులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. మోదీకి కేసీఆర్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ డైరెక్షన్ లో తనపై దాడి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూంలను కట్టలేక పోయారని, కానీ ప్రజాకూటమి ఇళ్లు కట్టుకునేవారికి రూ. 5 లక్షలు ఇస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. తెలంగాణపై తనకు ఆవేదన, బాధ ఉందని... అందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. 

  • Loading...

More Telugu News