bjp: బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ రైతు ఆందోళనలే: రాహుల్ గాంధీ
- కార్పొరేట్ లకు మాత్రం రుణాలు మాఫీ చేస్తారా?
- రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరు
- మోదీ విధానాలతో అనిల్ అంబానీ జేబులు నిండాయి
సంపూర్ణ రుణమాఫీ, కనీస మద్దతు ధర కావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కిసాన్ ర్యాలీ చేస్తున్న వేలాది మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ వద్ద తమ నిరసన తెలియజేసేందుకు ర్యాలీగా వస్తున్న రైతులకు అనుమతి లేదంటూ జంతర్ మంతర్ వద్దే ఆపేశారు. ఈ నేపథ్యంలో రామ్ లీలా మైదానంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారికి సంఘీభావం తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, యువత తమ భవిష్యత్ కోసం పోరాడుతున్నారని, కార్పొరేట్ లకు రుణాలు మాఫీ చేస్తున్న ప్రధాని మోదీ, రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు.
మోదీ విధానాల వల్ల అనిల్ అంబానీ జేబులు నిండాయే తప్ప రైతులకు మేలు జరగలేదని, మోదీ తన స్నేహితులకు రూ.3 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఫసల్ బీమా యోజన వల్ల రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమని విమర్శించారు.