modi: మోదీ, రాహుల్ లు ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదు: సీఎం కేసీఆర్
- ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు
- ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
- ఈ ఎన్నికలు చాలా కీలకం
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని, వాళ్లిద్దరూ ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కరెంట్ లేదంటూ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ అని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి, అంతిమంగా గెలిచేది ప్రజలేనని అన్నారు నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలని, ఓటు ప్రాధాన్యత గుర్తించి ప్రజా ఎజెండా వైపు అడుగులు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రగతి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నామని, అదే పేదలకు పంచుతున్నామని కేసీఆర్ చెప్పారు.