Chandrababu: చంద్రబాబు కోరగానే.. వైఎస్ మగాడిలా సీబీఐ విచారణకు ఆదేశించారు!: వైసీపీ నేత పార్థసారథి
- అన్నింటిని టీడీపీ మంత్రులు, నేతలు దోచేస్తున్నారు
- ఓఆర్ఆర్ పై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- దోమలపై దండయాత్రలో కూడా బాబు విఫలం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులే రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తున్నారని వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మతి భ్రమించిందనీ, ఆయన్ను ఏదైనా పిచ్చాసుపత్రిలో వెంటనే చేర్పించకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. మట్టి, ఇసుక, నీళ్లు.. ఇలా తేడా లేకుండా ప్రతీదాన్ని టీడీపీ నేతలు దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ఏపీలో చేస్తున్నది ధర్మపోరాటం కాదనీ, అది పచ్చ పోరాటమని వ్యాఖ్యానించారు. కాకినాడలో ఈరోజు నిర్వహించిన ‘వంచనపై గర్జన దీక్ష’లో పార్థసారథి మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ‘తమ్ముళ్లూ.. హైదరాబాద్ ఎయిర్ పోర్టును కట్టింది నేను కాదా.. ఓఆర్ఆర్ నిర్మించింది నేను కాదా!’ అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తుంటే.. రైతుల భూములను లాక్కుని అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారని గుర్తుచేసుకున్నారు. దీంతో వెంటనే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నా.. అంటూ ప్రకటించిన మగాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేసుకున్నారు. దోమలపై దండయాత్ర చేసినప్పటికీ చంద్రబాబు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.