India: ఆస్ట్రేలియా టూర్ లో భారత్ కు ఎదురుదెబ్బ.. గాయంతో పృథ్వీ షా ఔట్!
- కాలి చీలమండకు తీవ్రగాయం
- వెంటనే ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
- ఆస్ట్రేలియా ఎలెవన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఘటన
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదలుకాకముందే యువ సంచలనం పృథ్వీ షా గాయపడ్డాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మూడోరోజు ఆట జరుగుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా కాలుకు గాయమైంది. ఎడమకాలు చీలమండ మడతపడటంతో పృథ్వీ బాధతో విలవిల్లాడిపోయాడు.
వెంటనే గ్రౌండ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చిన సిబ్బంది పృథ్వీ షాను జాగ్రత్తగా పెవిలియన్ కు తీసుకెళ్లారు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా మ్యాక్స్ బ్రియాంట్ బ్యాటింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కొట్టిన షాట్‌ను పృథ్వీ అందుకునేందుకు యత్నించడంతో షాకు గాయమైంది. ఈ నేపథ్యంలో షాను భారత జట్టు సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు షా దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే ముగిసిన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు. అచ్చం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను మరిపించేలా ఆడుతున్న పృథ్వీ షాను భారత జట్టు భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు.