railway: శీతాకాలంలో అరకు అందాలు చూతము రారండీ.. విశాఖ నుంచి రేపే ప్రత్యేక రైలు ప్రారంభం!
- 1, 2, 8, 9 తేదీల్లో నడపాలని రైల్వే శాఖ నిర్ణయం
- ఏజెన్సీకి పెరుగుతున్న పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు
- ఉదయం 8.50 గంటలకు విశాఖలో, మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరనున్న రైలు
పర్యాటక ప్రాంతం అరకుకు ప్రత్యేక రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. చలికాలంలో ఏజెన్సీ సందర్శన ఓ అద్భుత అనుభూతి. చేతికందే ఎత్తులో వుండే మంచు తెరల్ని ముద్దాడాలని, గిలిగింతలు పెట్టే చలిలో ఉల్లాసాన్ని సొంతం చేసుకోవాలని కోరుకునే పర్యాటకులు ఈ కాలంలో ఏజెన్సీకి పోటెత్తుతారు. ముఖ్యంగా ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి సందర్శన ఓ అద్భుత అవకాశంగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడ మైనస్ నుంచి 3 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
అప్పుడే పర్యాటకుల రద్దీ పెరగడంతో రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. డిసెంబరు 1, 2, 8, 9 తేదీల్లో ఈ రైలు విశాఖ-అరకు మధ్య నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ తెలిపారు. 08517 నంబరు రైలు ఉదయం 8.50 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 11.50 గంటలకు అరకు లోయకు చేరుకుంటుంది. ఇదే రైలు 08516 నంబరుతో అరకులో మధ్యాహ్నం 2 గంటలకు బయుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
ఈ రైలులో ఒక సెకండ్ క్లాస్ చైర్ కారు, ఏడు జనరల్ సెకండ్‌క్లాస్ బోగీలు, రెండు సెకండ్‌క్లాస్ కమ్ గేజీ బోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహల స్టేషన్‌లలో ఆగుతుంది.