KCR: ప్రజాకూటమి ఎఫెక్ట్... ప్రచార షెడ్యూల్ ను పొడిగించుకున్న కేసీఆర్!
- ఇప్పటివరకూ 76 సభల్లో పాల్గొన్న కేసీఆర్
- నేడు మరో 7 సభలు
- 2 నుంచి 4 వరకూ మరో 15 సభలు
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రచార షెడ్యూల్ ను మరింతగా పెంచుకున్నారు. ఇప్పటివరకూ 76 సభలను పూర్తి చేసుకున్న ఆయన, నేడు మరో 7 సభల్లో పాల్గొననుండగా, శనివారం నాడు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. ఆపై రెండవ తేదీ నుంచి మూడు రోజుల పాటు మరో 15 సభల్లో పాల్గొంటారని టీఆర్ఎస్ ప్రకటించింది. 2వ తేదీన నాగర్ కర్నూలు, చేవెళ్ల, పటాన్ చెరు, హైదరాబాద్, 3వ తేదీన సత్తుపల్లి, మధిర, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, 4వ తేదీన ఆలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ సభల్లో సీఎం ప్రసంగించనున్నారు.
ఇక రెండు, లేదా మూడున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రచారానికి ఆఖరిరోజైన 5వ తేదీ కేసీఆర్ షెడ్యూల్ ఇంకా వెల్లడి కానప్పటికీ, సాయంత్రం గజ్వేల్ లో జరిగే రోడ్ షోతో కేసీఆర్ తన ప్రచారాన్ని ముగిస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ప్రజా కూటమి తరఫున జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు పలువురు ప్రచారంలోకి దిగడం, మరోవైపు బీజేపీ కూడా జాతీయ స్థాయి నాయకులను పంపించడంతోనే కేసీఆర్ తన షెడ్యూల్ ను మరింతగా విస్తరించినట్టు తెలుస్తోంది.