Harish Rao: ఏపీలో నచ్చని టీడీపీ తెలంగాణలో ఎందుకు నచ్చిందో రాహుల్‌ సమాధానం చెప్పాలి : మంత్రి హరీష్‌రావు

  • చంద్రబాబు సర్కారు తీరును నిరసిస్తూ ‘ప్రజావంచన వారం’ ఎందుకు చేపట్టినట్లు
  • ఏపీలో చెల్లని రూపాయి  తెలంగాణలో చెల్లుతుందని ఎలా అనుకుంటున్నారు
  • హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పి అప్పుడు చంద్రబాబు తెలంగాణలో తిరగాలని సూచన

కాంగ్రెస్‌ నాయకులపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో నచ్చని తెలుగుదేశం పార్టీ  తెలంగాణలో ఎందుకు నచ్చిందో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం  తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్‌ విడుదల చేసిన చార్జిషీట్‌ను ఆయన మీడియాకు చూపించారు.

‘చంద్రబాబు సర్కారు ప్రజల్ని మోసగించిందని, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి చెల్లించలేదని ద్వజమెత్తింది మీరే. ఏపీలో హామీలు అమలు కావడం లేదంటూ ఏడు రోజుపాటు ‘అక్కడ ప్రజావంచన వారం’ నిర్వహించిందీ మీరే కదా’ అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని రూపాయిగా భావించిన చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు చెల్లుతాడని భావిస్తున్నారో సమాధానం చెప్పాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని చంద్రబాబు నిలువునా ముంచారని ఆరోపించారు. రుణమాఫీ అంటూ ఊరించి, చేయక పోవడంతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. అటువంటి వ్యక్తిని వెంటేసుకు వచ్చిన రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారిది ప్రజా కూటమి కాదని, దగా కూటమి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పట్ల చంద్రబాబు అనుసరించిన అభివృద్ధి నిరోధక చర్యలను ప్రజలు మర్చిపోరని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీనీ కేసీఆర్‌ అమలు చేశారన్నారు. తెలంగాణ   ప్రజలకు కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉందని, రాహుల్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. 2014లో మోదీతో పొత్తు చారిత్రక అవసరం అన్న చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరమంటున్నారని, అవసరాన్ని బట్టి చంద్రబాబు మాటలు మారుస్తారని ధ్వజమెత్తారు. 

  • Loading...

More Telugu News