Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేశ్ కు అరుదైన గౌరవం.. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన 100మందిలో చోటు!
- జాబితాను ప్రకటించిన ‘ఏ పొలిటికల్’ సంస్థ
- 16వ స్థానం దక్కించుకున్న నారా లోకేశ్
- పాలనలో మార్పు తీసుకొచ్చినందుకు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఏ పొలిటికల్’ అనే అంతర్జాతీయ పాలసీ సంస్థ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల జాబితాలో లోకేశ్ కు చోటు దక్కింది. 2018 సంవత్సరానికి ప్రకటించిన ఈ జాబితాలో ఏకంగా నారా లోకేశ్ 16వ స్థానాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు.
ప్రభుత్వ పనితీరు, పాలనలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులను ‘ఏ పొలిటికల్ సంస్థ’ ఓ జాబితాలో ఎంపిక చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సాయం లేకుండా క్రౌడ్ ఫండింగ్ తో భారత్ లో 100 కి.మీ రోడ్డు నిర్మించిన ఆర్మ్ స్ట్రాంగ్ పేమే, అమెరికాలోనే యువ మేయర్ గా రికార్డు సృష్టించిన మేఖేల్ టబ్స్, అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన పిన్న వయస్కురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.