Cricket: నా జీవితంలో ఇది చీకటి రోజు.. రమేశ్ పవార్ విమర్శలపై స్పందించిన మిథాలీ రాజ్!
- నా దేశభక్తిని అవమానించారు
- క్రికెట్ ప్రేమతో ఆడుతున్నాను
- ట్విట్టర్ లో స్పందించిన మిథాలీ
స్ట్రెయిక్ రేట్ మెరుగ్గా లేకపోవడంతోనే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను తప్పించామని కోచ్ రమేశ్ పవార్ చెప్పడంపై మిథాలీ స్పందించింది. తనపై కోచ్ తో పాటు బీసీసీఐ పరిపాలక మండలి సభ్యురాలు డయానా ఎలుడ్జీ చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. క్రికెట్ అంటే తనకు ప్రాణమనీ, గత 20 ఏళ్లుగా భారత్ తరఫున అంకితభావంతో క్రికెట్ ను ఆడుతున్నట్లు స్పష్టం చేసింది.
కానీ ఈ రోజు తన సామర్థ్యాన్ని, ఆటతీరును ప్రశ్నిస్తున్నారనీ, తన దేశభక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని మిథాలీ వాపోయింది. ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు’ అని వ్యాఖ్యానించింది. అన్నిరకాలుగా తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందనీ, వీటిని ఎదుర్కొనేందుకు దేవుడే తనకు శక్తినివ్వాలని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో మిథాలీ ఓ సందేశాన్ని ఈ రోజు పోస్ట్ చేసింది.