Revanth Reddy: సీఎం పదవి గురించి ఆలోచించడం లేదు: రేవంత్ రెడ్డి
- ప్రజా కూటమిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నా
- మెజారిటీ సాధించిన తరువాతే సీఎం అభ్యర్థిపై నిర్ణయం
- ఈ ఎన్నికల్లో బీజేపీ పాత్ర నామమాత్రమేనన్న రేవంత్
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజా కూటమిని గెలిపించేందుకు ఓ కాంగ్రెస్ నేతగా తనవంతు ప్రయత్నాన్ని చేస్తానని, ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆశలు లేవని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా కూటమి మెజారిటీ సాధించి తీరుతుందని, ఆ తరువాత గెలిచిన ఎమ్మెల్యేలంతా కలుస్తారని, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పరిశీలకులు వచ్చి, సీఎం అభ్యర్థుల జాబితాను పంపుతారని, పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు సీఎం ఎవరనేది అప్పుడే తేలుతుందని రేవంత్ అన్నారు.
కేసీఆర్ అన్ని సభల్లోనూ దారుణమైన పదజాలాన్ని వినియోగిస్తూ తిడుతున్నారని, అది ఆయన నైజాన్ని చెప్పకనే చెబుతుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పాత్ర నామమాత్రమేనని అభిప్రాయపడ్డ ఆయన, చాలా చోట్ల టీఆర్ఎస్ ను గెలిపించేలా ఓట్లను చీల్చేందుకే ఆ పార్టీ పోటీ పెడుతోందని, ప్రజలు దీన్ని గమనించారని అన్నారు. నాలుగు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఖాయమని తెలిపారు.