Andhra Pradesh: సుజనా చౌదరిపై ఐటీ దాడులపై స్పందించిన చంద్రబాబు!
- బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట
- బెదిరింపు ధోరణికి భయపడేది లేదు
- తెలంగాణలో ప్రజా కూటమి గెలవాలన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఎంపీ వై సుజనా చౌదరిపై ఈడీ, ఐటీ దాడులు బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలుగుదేశం ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, బీజేపీ బెదిరింపు ధోరణికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోదీ ఆదేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు చారిత్రక అవసరమని వ్యాఖ్యానించిన ఆయన, 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలని అన్నారు.
ఇప్పటివరకూ 24,11,556 మంది సభ్యత్వ నమోదు పూర్తయిందని, దీన్ని మరింత ముమ్మరం చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. వ్యవస్థ నిర్మాణం, వనరుల సమీకరణ విధానాల అమలు పకడ్బందీగా జరగాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 30న రాజమండ్రిలో 'బీసీ జయహో' భారీ సభను విజయవంతం చేసేందుకు నేతలంతా కృషి చేయాలని సూచించారు.
విడిపోయిన వేళ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల్లో ఉండటానికి కేసీఆర్ విధానాలే కారణమని విమర్శించిన చంద్రబాబు, లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతిని సాధించిందని చెప్పారు.