modi: గాచారం బాగోలేకే మోదీ మనతో పెట్టుకున్నాడు.. ఇంత తెలివి తక్కువోడని అనుకోలేదు: కేసీఆర్
- ప్రధాని పదవిలో ఉండి అబద్ధాలు మాట్లాడవద్దు
- టీఆర్ఎస్, మజ్లీస్ లు మిత్రపక్షాలు
- మహాకూటమి, టీఆర్ఎస్ కు మధ్యే పోటీ
గాచారం బాగోలేకే మనతో ప్రధాని మోదీ పెట్టుకున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ముస్లింల జనాభా పెరిగిందని... వారికి తగ్గట్టుగా రిజర్వేషన్లను పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని... అక్కడేమో మత గజ్జి ఉన్న ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఈరోజు మోదీ నిజామాబాద్ వచ్చారని... ఇంత తెలివి తక్కువోడని తాను అనుకోలేదని... నిజామాబాద్ ప్రజలకు నీరు, కరెంట్ కూడా లేదని అన్నారని మండిపడ్డారు. మోదీ అక్కడే ఉంటే హెలికాప్టర్ లో నేరుగా నిజామాబాద్ వస్తానని... కరెంట్ ఉందా? లేదా? అనే విషయం ప్రజలనే అడుగుదామని సవాల్ విసిరారు. బాధ్యతగల ప్రధాని పదవిలో ఉండి తప్పులు మాట్లాడవద్దని మోదీకి సూచించారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు.
పదవీకాలాన్ని మధ్యలోనే ముగించానని మోదీ విమర్శించారని... అధికారం అనుభవించడం ఇష్టంలేక పదవీకాలాన్ని ముగించామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్-మజ్లిస్ రెండూ మిత్రపక్షాలుగా పనిచేస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ను అస్థిరపరచాలని మోదీ, చంద్రబాబులు యత్నించారని మండిపడ్డారు.
దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు, నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ మరోవైపు ఎన్నికల బరిలో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల బరిలో ఈ రెండు పక్షాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయాయని విమర్శించారు. మహబూబ్ నగర్ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రాష్ట్రంలో ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పారు. ఈ ఏడాది 20 శాతం వృద్ధి రేటును సాధించామని అన్నారు.