Chandrababu: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రేపు రాహుల్, బాబు
- తెలంగాణకు పోటెత్తనున్న ప్రముఖులు
- నేడు మోదీ.. రేపు రాహుల్, చంద్రబాబు
- ప్రచారంలో కాక పుట్టించనున్న నేతలు
తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న రాజకీయ పక్షాలు ‘పెద్దలను’ రంగంలోకి దించుతున్నాయి. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రాబోతున్నారు.
నిజామాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, మహబూబ్‌నగర్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని సభల కోసం బీజేపీ భారీగా జనసమీకరణ చేస్తోంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో జరగనున్న సభలోనూ మోదీ పాల్గొననున్నారు. అలాగే, బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు కూడా తెలంగాణలో ప్రచారానికి రాబోతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. బుధ, గురువారాల్లో వారు ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల, విడివిడిగా మరికొన్ని చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం కొడంగల్, వికారాబాద్, ఖమ్మం సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ.. సికింద్రాబాద్, నాంపల్లిలలో రోడ్‌షోలలో పాల్గొంటారు. గురువారం హైదరాబాద్‌లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించే సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. అలాగే, భూపాలపల్లి, ఆర్మూరు సభల్లో పాల్గొంటారు. చేవెళ్లలో బస్తీ సమావేశం నిర్వహించనున్నారు.
బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో, రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. 30వ తేదీ నుంచి డిసెంబరు 4 వరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రచారానికి రానున్నారు.