Chandrababu: కాంగ్రెస్ లో తల్లీకొడుకుల రాజ్యం నడుస్తుంటే.. టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోంది!: జీవీఎల్ నరసింహారావు ధ్వజం

  • కేసీఆర్, సోనియా లాలూచీ పడ్డారు
  • ఫలితాలు వచ్చిన 5 గంటల్లో పొత్తు
  • మోదీని ఇబ్బంది పెట్టేందుకు బాబు, కేసీఆర్ ప్లాన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ లాలూచీని తెలంగాణ ప్రజలు గమనించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కోరారు. తెలంగాణ ఎన్నికల వేళ సోనియాగాంధీ, కేసీఆర్ పరస్పరం పల్లెత్తు మాట కూడా అనుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడు జగన్నాటకం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ఇవన్నీ కుటుంబ పార్టీలేననీ, వీటి మధ్య లాలూచీ సులభంగా కుదురుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తల్లీ-కొడుకుల రాజ్యం నడుస్తుంటే, టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శక, అవినీతి రహిత పాలన, అభివృద్ధి కోసం తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలను కోరారు.

ఎన్నికలు పూర్తయిన ఐదు గంటల్లోనే ఈ అవినీతి రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటాయని జోస్యం చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ముగిసిపోతుందని విమర్శించారు. ప్రధాని మోదీని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు, కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ పట్ల కేసీఆర్ కు చాలా ఆప్యాయత ఉందనీ, అందుకే కాంగ్రెస్ చేసిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News