Andhra Pradesh: ‘మియావాకి’ పద్ధతిలో మొక్కలు నాటుదాం.. ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపు!
- ఏటా 5 లక్షల మొక్కలు నాటాలి
- ఏపీలో 50 శాతం పచ్చదనం కోసం కృషి చేయండి
- అధికారులకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం పచ్చదనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఏటా ఐదు లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో పంచాయితీరాజ్, అటవీశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జపాన్ పర్యావరణవేత్త అకిరా మియావాకిని లోకేశ్ ప్రస్తావించారు.
అడవులను వేగంగా పెంచేలా మియావాకి పద్ధతిని అనుసరించాలని లోకేశ్ ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో మియావాకి పద్ధతిలో అడువులను పెంచే అవకాశం ఉందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రతీ మండలంలో ఓ నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 ఎకరాల్లో మియావాకి మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మియావాకి పద్ధతి అంటే..
మియావాకి పద్ధతిలో తొలుత నేలను మొక్కలు నాటేందుకు అనుకూలంగా తయారు చేస్తారు. ఎంపికచేసిన చోట ముందుగా భూ పరీక్ష చేస్తారు. దాన్నిబట్టి ఆ నేలలో ఏ పోషకాలు లోపించాయో, వాటిని ఎంత జోడించాలో తెలుసుకుంటారు. ఆ తర్వాత పెంచాల్సిన మొక్కల్ని ఎంపిక చేస్తారు. సాధారణంగా స్థానిక వృక్ష జాతులనే నాటుతారు. మొక్కలు పెంచాల్సిన చోట మీటరు లోతున నేలను తవ్వి మట్టిలో కొబ్బరి పొట్టు, వూక, పౌల్ట్రీ వ్యర్థాలతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే మరికొన్ని జీవ వ్యర్థాలను కలుపుతారు.
ఇలా చేయడంవల్ల మొక్కలకు పోషకాలు అంది వేర్లు సులభంగా నేల లోపలికి చొచ్చుకునిపోతాయి. నేలలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటుంది కూడా. ఈ ప్రక్రియలో రసాయన ఎరువుల్ని మాత్రం ఉపయోగించరు. మొక్కలు నాటాక నేలలో తేమ ఇంకిపోకుండా ఆ స్థలంలో మొక్కల మధ్యన వరి గడ్డిని వేస్తారు. సాధారణంగా అడవుల్లో చెట్లు నాలుగు రకాలుగా ఉంటాయి.
అవి పొదలు, తక్కువ ఎత్తుండే చెట్లు, ఒక మాదిరి చెట్లు, భారీ వృక్షాలు. మియావాకి పద్ధతిలో మొక్కలు నాటేటప్పుడు ఇదే అంశాన్ని పాటిస్తారు. స్థలాన్నీ, సూర్యరశ్మినీ మొక్కలు ఒకదానితో ఒకటి పోటీపడి తీసుకునేలా కాకుండా అన్నిటికీ సరిపోయేలా కొంచెం దూరం పాటిస్తూ నాటుతారు. ఈ పద్ధతిలో మిగతా అడవితో పోల్చుకుంటే మియావాకి అడవి 30 రెట్లు దట్టంగా, 8 రెట్లు వేగంగా పెరుగుతుంది.