Blade batch: విజయవాడలో నడిరోడ్డుపై బ్లేడ్ బ్యాచ్ వీరంగం.. పరుగులు తీసిన జనం

  • పెచ్చుమీరుతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు
  • సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో వీరంగం
  • ఒంటరిగా కనిపిస్తే అయిపోయినట్టే

విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం బ్లేడ్ బ్యాచ్ నడిరోడ్డుపై వీరంగమేసింది. అరుపులు, కేకలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. పదునైన ఆయుధాలతో  కొట్టుకుంటున్న వీరిని చూసిన ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. పరుగులు పెడుతున్న జనాలను చూసి అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో రక్తమోడుతున్న వారిని ఆసుపత్రికి తరలించారు.

విజయవాడలో ఇటీవల బ్లేడ్ బ్యాచ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరించి డబ్బులు కాజేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.  వీరిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్నారు.

ముఖ్యంగా నెహ్రూ బస్ స్టేషన్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న రైలు పట్టాలు, పద్మావతి, కృష్ణవేణి ఘాట్లను అడ్డాగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. గుంపుగా వచ్చే జనం జోలికి వెళ్లని ఈ బ్లేడ్ బ్యాచ్ ఒంటరిగా కనిపిస్తే మాత్రం వదిలిపెట్టరు. మొదట డబ్బులు అడుగుతారు. ఇవ్వకపోతే బ్లేడ్‌తో దాడిచేసి గాయపరుస్తారు. జేబులోని డబ్బులు, ఫోన్లు తీసుకుని పరారవుతారు.

వీరిని పట్టుకునేందుకు పోలీసులే వెనక్కి జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం బ్లేడును దగ్గరపెట్టుకుని తిరిగే వీరు పోలీసులు కనిపించగానే తమను తాము గాయపరుచుకుంటారు. వారు చనిపోతే తమ మెడకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో పోలీసులు వెనక్కి తగ్గుతున్నారు.

Blade batch
Vijayawada
Police
Andhra Pradesh
Crime News
  • Loading...

More Telugu News