lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో 'జీఎస్టీ'లో కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంటుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు: కేతిరెడ్డి
- ఓ టీవీ డిబేట్ లో వర్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు
- వర్మ వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఎందుకు మౌనంగా ఉన్నారు?
- ఇలాంటి సినిమాతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో 'జీఎస్టీ' (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) సినిమాలో కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంటుందని... ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్ లో స్వయంగా ఆయనే చెప్పారని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. లక్ష్మీపార్వతి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని సూచించారు. 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో తాను చిత్రాన్ని నిర్మిస్తుంటే లక్ష్మీపార్వతి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
వర్మతో లక్ష్మీపార్వతి ములాఖత్ అయినట్టున్నారని... అందుకే అడల్ట్ కంటెంట్ ఉంటుందని వర్మ చెప్పినా, ఆమె మాట్లాడటం లేదని విమర్శించారు. వర్మ చెబుతున్న దానికి మీ అంగీకారం ఉన్నట్టేనా? అని ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి చెప్పినట్టు వర్మ సినిమా తీయడని... ఆయన చెప్పిన ప్రతి మాటను సినిమాలో చూపిస్తారని అన్నారు. ఇలాంటి సినిమాతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. యవ్వనంలో ఉన్న ఓ మహిళకు, వయసు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తికి మధ్య జరిగే ప్రేమే మా సినిమాకు కథ అని తెలిపారు. లక్ష్మీపార్వతి ఇప్పటికైనా మేలుకోవాలని కోరారు.