gaja storm: తుపాను బాధితులకు ఇళ్లు కట్టిస్తా.. తొలి ఇల్లు మాత్రం ఈ తల్లికే!: రాఘవ లారెన్స్
- గజతో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు
- ఆదుకునేందుకు ముందుకొచ్చిన లారెన్స్
- యువతతో పనుల పర్యవేక్షణ
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇటీవల తమిళనాడును వణికించిన గజ తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో 50 ఇళ్లను కట్టిస్తానని ప్రకటించాడు. ఇలాంటివారి వివరాలను తనకు తెలపాలని కోరాడు.
ఈ సందర్భంగా ఉన్న ఒక్కగానొక్క పూరిగుడిసె కూలిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్న ఓ వృద్ధురాలి వీడియోను పోస్ట్ చేశాడు. తాను తొలుత ఈ అమ్మకు ఇల్లు కట్టిన తర్వాతే మిగతా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తానని చెప్పాడు. ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కొంతమంది యువకులకు అప్పగించాననీ లారెన్స్ చెప్పారు.
సహాయక కార్యక్రమాల్లో రాఘవ లారెన్స్ పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో 151 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా లారెన్స్ అభిమానులతో పంచుకున్నారు.