Chandrababu: టూరిజంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాం.. ప్రజల కోసం ‘ఆనంద ఆదివారం’ తీసుకొచ్చాం!: సీఎం చంద్రబాబు

  • కూచిపూడి నాట్యం మన సంస్కృతిలో భాగం
  • పర్యాటకంతో రాష్ట్రానికి ఎంతో లాభం
  • ఎయిర్ షో ముగింపు వేడుకల్లో సీఎం వెల్లడి

పర్యాటకం కారణంగా ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు షాపింగ్ చేస్తారనీ, తద్వారా ఆతిథ్య పరిశ్రమతో పాటు స్థానిక హస్తకళల మార్కెట్ విస్తరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రుచికరమైన, ఆర్గానిక్ పంటలను పండిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి ఎయిర్ షో-2018 ముగింపు వేడుకల సందర్భంగా ఈ రోజు సీఎం చంద్రబాబు మాట్లాడారు.

కూచిపూడి నాట్యం మన సంస్కృతిలో భాగమని చంద్రబాబు అన్నారు. దీనిద్వారా ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం సమకూరుతుందని వ్యాఖ్యానించారు. ప్రతీ ఆదివారం ప్రజలు రిలాక్స్ కావడానికి ‘ఆనంద ఆదివారం‘ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో హ్యాపీనెస్ ఇండెక్స్ ను తీసుకొచ్చామన్నారు. ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలతో సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

హ్యాపీనెస్ ఇండెక్స్, టూరిజంలో ఏపీ ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు నైపుణ్యం కల్పించే రాష్ట్రం జాబితాలో, సులభతర వాణిజ్య విధానంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించపోయినా మన కష్టం, తెలివితేటలతో ఈ ఘనతను సాధించామని చెప్పారు. 

  • Loading...

More Telugu News