Telangana: ప్రేమ విషాదం.. పరువు పోయిందని యువతి సోదరుడి ఆత్మహత్య.. మనస్తాపంతో ప్రియుడి తండ్రి బలవన్మరణం!

  • సంగారెడ్డి జిల్లాలోని మేదపల్లిలో ఘటన
  • ప్రేమించుకున్న నాగమణి, మహేశ్
  • ఒప్పుకోని ఇరు కుటుంబాల పెద్దలు

తాము తెచ్చిన పెళ్లి సంబంధాన్ని చేసుకునేందుకు చెల్లి నిరాకరించడంతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన అమ్మాయి ప్రియుడి తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆందోళనకు లోనైన యువతి పురుగుల మందు తాగింది. ఈ వరుస ఆత్మహత్యల పరంపర సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం మండలం మేదపల్లిలో చోటుచేసుకుంది.

మేదపల్లికి చెందిన మహేశ్ బీటెక్ వరకూ చదివాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన యువతి నాగమణిని ప్రేమించాడు. అయితే నాగమణి కుటుంబ సభ్యులు గొడిగార్‌పల్లికి చెందిన యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయం చేశారు. ఈ సందర్భంగా పెళ్లిచూపులకు వచ్చిన యువకుడికి తాను, నాగమణి ప్రేమించుకుంటున్నామని మహేశ్ సందేశం పంపాడు. దీంతో సదరు యువకుడు హుందాగా ముందుగానే పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై అమ్మాయి కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇరువురి కుటుంబాలు పంచాయితీకి వెళ్లాయి. కాగా, ఒకే సామాజికవర్గం కావడంతో యువతీయువకులకు పెళ్లి చేయాలని పెద్దలు సూచించారు.

అయితే ఇందుకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నాగమణి కారణంగా తమ పరువు పోయిందని భావించిన ఆమె అన్న జగదీశ్వర్(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ యువకుడు చనిపోవడానికి తన కుమారుడే కారణమయ్యాడని మహేశ్ తండ్రి మనస్తాపం చెందాడు. ఆయన కూడా పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.

తన  కారణంగానే సోదరుడు, ప్రియుడి తండ్రి చనిపోయారని ఆందోళనకు లోనైన నాగమణి సైతం పురుగుల మందు తాగింది. ఆమెను ఇంట్లోవాళ్లు వెంటనే సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం నాగమణి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Sangareddy District
love affairs
3 suicides
2 dead
  • Loading...

More Telugu News