Andhra Pradesh: పశ్చిమగోదావరి జనసేనలో రచ్చ.. సొంత పార్టీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్త!

  • జిల్లాలోని పెదవేగి మండలంలో ఘటన
  • పార్టీ ఖర్చులకు ఇచ్చిన నగదుపై వివాదం
  • తిరిగివ్వాలని కార్యకర్తకు వేధింపులు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిలో జనసేన నేతపై అదే పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను ఇంటికి పంపి బెదిరించడంతో పాటు తన బైక్ ను ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లా జనసేన విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన పసుపులేటి శ్రీరామభార్గవ్‌ కృష్ణ జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం నారా శేషు అనే వ్యక్తి జనసేనలో చేరాడు. ఈ సందర్భంగా స్థానికంగా తనను ప్రమోట్ చేసుకునేందుకు వీలుగా ప్లెక్సీల ఏర్పాటు కోసం రూ.20 వేలను శ్రీరామభార్గవ్‌ కృష్ణకు ఇచ్చాడు. శేషు చెప్పినట్లే శ్రీరామభార్గవ్‌ కృష్ణ ప్లెక్సీలతో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.

అయితే ఇటీవలి కాలంలో శేషు ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రీరామభార్గవ్‌ కృష్ణతో పాటు మరికొందరు జనసేన కార్యకర్తలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం పనిచేయాలనీ లేదంటే తాను గతంలో ఇచ్చిన రూ.20 వేలు వెనక్కు ఇచ్చేయాలని శేషు శ్రీరామభార్గవ్‌ కృష్ణను వేధించడం మొదలుపెట్టాడు. వాటిని పార్టీ కోసం ఖర్చు పెట్టామని చెప్పినా వినకుండా రౌడీలను ఇంటికి పంపి బెదిరించడం మొదలుపెట్టాడు.

అయినా లొంగకపోవడంతో ఈ నెల 15న అంబికా థియేటర్ వద్ద పార్క్ చేసిన స్కూటర్ ను ఆయన అనుచరుడు ఎత్తుకెళ్లాడు. ఇవ్వాల్సిన నగదును చెల్లించిన తర్వాతే బైక్ ను తీసుకెళ్లాలని వారు స్పష్టం చేశారు. దీంతో శేషుతో పాటు ఆయన అనుచరులు వరం, మధులపై నగర టూటౌన్ పోలీసులకు శ్రీరామభార్గవ్‌ కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News