Sujana Chowdary: సుజనాచౌదరికి సమన్లు జారీ చేసిన ఈడీ.. ఐదు ఖరీదైన కార్లు సీజ్
- ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం
- 120 డొల్ల కంపెనీలు ఉన్నాయని గుర్తించిన ఈడీ
- బ్యాంకులకు రూ. 5,700 కోట్ల మేర ఎగవేశారన్న అధికారులు
టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. 27వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుజనాచౌదరిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ఆయన కంపెనీలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సుజనాచౌదరి అధీనంలో 120 డొల్ల కంపెనీలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. బ్యాంకులకు సుజనా గ్రూపు కంపెనీలు రూ. 5,700 కోట్ల మేర ఎగవేసినట్టు వారు తెలిపారు. ఈ కంపెనీలన్నీ సుజనాచౌదరి ఆదేశాల మేరకే నడుస్తున్నాయని గుర్తించామని చెప్పారు. ఈ కంపెనీలపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా కేసులున్నాయని తెలిపారు. హైదరాబాద్ కార్యాలయం నుంచి డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయనకు సంబంధించిన ఐదు ఖరీదైన కార్లను సీజ్ చేశామని వెల్లడించారు.