Telangana: మోదీ మనుషులను మనుషుల్లా చూడరు.. మతం ఆధారంగానే చూస్తారు!: కేటీఆర్
- నరేంద్ర మోదీ మా రాజకీయ ప్రత్యర్థి
- ఆయనే తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించారు
- కూకట్ పల్లి సంఘీభావ సభలో కేటీఆర్
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. మోదీకి మనుషులను మనుషులుగా చూసే అలవాటు లేదనీ, ఆయన మనుషులను మతాల ఆధారంగానే చూస్తారని వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయ ప్రత్యర్థి సైతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారని తెలిపారు.
తమ ప్రభుత్వం మోదీకి భిన్నమనీ, తాము ప్రజలను ప్రజల్లాగే చూస్తామనీ, మతం, కులం, వర్గం ఆధారంగా వారిని విభజించబోమని మంత్రి స్పష్టం చేశారు. కూకట్ పల్లిలో ఈ రోజు నిర్వహించిన సీమాంధ్రుల సంఘీభావ సభలో మంత్రి మాట్లాడారు.
2014లో ఏపీ విభజన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి పెట్టారంటూ సాక్షాత్తూ అలాంటి మోదీనే ప్రశంసించారని కేటీఆర్ అన్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం రోజూ కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకున్నారని విమర్శించారు. అందువల్లే అమరావతిలో ఇప్పుడు గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి బిల్డింగులు లేవని ఎద్దేవా చేశారు.
‘హైదరాబాద్ ను నేను కట్టాను’ అన్న చంద్రబాబు మాటలు వింటే భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్ షా తెగ బాధపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చార్మినార్ కు ముగ్గేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క సైబర్ టవర్స్ భవనాన్ని కట్టి ఏదో హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు.