America: కారును ఢీకొట్టిన స్కూలు బస్సు.. క్షమాపణలు చెబుతూ లేఖ రాసిన ఆరో తరగతి అమ్మాయి..హేట్సాఫ్ అంటున్న ప్రపంచం

  • క్షమించాలని లేఖ రాసి కారుపై పెట్టిన 11 ఏళ్ల బాలిక
  • లేఖ చూసి ఫిదా అవుతున్న ప్రపంచం
  • రీ ట్వీట్ చేసిన 2.63 లక్షల మంది

న్యూయార్క్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక రాసిన ఓ క్షమాపణ లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ లేఖ చదివిన వారు ఆ చిన్నారికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. 2,63,886 మంది రీట్వీట్ చేసిన ఈ లేఖను ఆమె ఎందుకు రాసిందంటే..

ఈ నెల 19న బాలికను ఇంటి వద్ద దింపిన స్కూలు బస్సు టర్న్ తీసుకుంటుండగా పక్కనే పార్క్ చేసి ఉన్న కారును ఢీకొనడంతో దానికి సొట్టపడింది.  అయితే, ఇదేమీ పట్టించుకోని డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సు దిగిన బాలిక సొట్టపడిన కారును చూసి బాధపడింది. అక్కడితో వదిలేయకుండా, ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ తమను క్షమించాలని లేఖ రాసి కారుపై పెట్టి వెళ్లింది. రోజూ సాయంత్రం తనను ఇంటి వద్ద దిగబెట్టే 449 నంబరు బస్సు మీ కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని, దీనికి తమను క్షమించాలని వేడుకుంటూ రాసిన లేఖను కారుపై పెట్టి వెళ్లింది.

కాసేపటి తర్వాత తన కారు సొట్టపడి ఉండడాన్ని చూసిన సిపోవిజ్ (21).. ఈ పనిని ఎవరు చేసి ఉంటారని ఆలోచిస్తుండగా పక్కనే లేఖ కనిపించింది. అది చదివి ఆశ్చర్యపోయిన యువకుడు వెంటనే దానిని ట్విట్టర్‌లో పోస్టు చేసి బాలిక గొప్ప మనసును గురించి వివరించాడు. అంతే, లేఖ క్షణాల్లోనే వైరల్ అయింది. బాలిక సంస్కారానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఫిదా అయ్యారు.

లేఖ ఆధారంగా స్కూలుకు వెళ్లి బాలికను కలిసి అభినందిద్దామన్న సిపోవిజ్ ప్రయత్నం ఫలించలేదు. చేతి రాత ఆధారంగా బాలికను గుర్తించిన టీచర్లు స్కూలుకు సెలవులు ఇచ్చినట్టు చెప్పారు. దీంతో చిన్నారిని కలవలేకపోయానని, తర్వాత తప్పకుండా కలుస్తానని సిపోవిజ్ తెలిపాడు. ఇక కారుకు జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకొచ్చినట్టు తెలిపాడు. అంతేకాదు, క్షమాపణలు కూడా చెప్పారని వివరించాడు.

  • Loading...

More Telugu News