BJP: తెలంగాణకు ‘చంద్ర’ గ్రహణం... కోవర్టుగా మారిన కాంగ్రెస్‌ : బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు

  • ప్రాజెక్టులు అడ్డుకోవాలని కేంద్రానికి బాబు రాసిన లేఖలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి
  • చంద్రబాబు ముక్త తెలంగాణ అవసరం
  • టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టీకరణ

తెలంగాణ వ్యతిరేకులకు కాంగ్రెస్‌ పార్టీ కోవర్టుగా మారడంతో రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం పట్టిందని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు విమర్శించారు. తెలంగాణలో టీడీపీ తోక పార్టీ అని,  చంద్రబాబు ముక్త తెలంగాణ కావాలని పిలుపునిచ్చారు.  హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం బాబు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు అడ్డుకోవాలంటూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాదిలో విస్తరణ కోసం తెలంగాణ ఎన్నికలు తమ పార్టీకి ప్రతిష్ఠాత్మకమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించిన పార్టీ బీజేపీ అని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

2014లో టీడీపీతో పొత్తుపెట్టుకుని తాము తీవ్రంగా నష్టపోయామని గుర్తు చేసుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ మతంపై ఆధారపడ్డ పార్టీలు కాబట్టే మతపరమైన రిజర్వేషన్లను ఆ పార్టీలు వ్యతిరేకించడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీపై కేసీఆర్‌ చేసిన ఆరోపణలను మురళీధరరావు ఖండించారు. కేసీఆర్‌ పాలన నిజాం నవాబ్‌ను తలపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ కుటుంబ పార్టీలేనని ఆరోపించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News