Vijayawada: నరాలను తెంపే క్రైమ్ థ్రిల్లర్... 8 నెలల విచారణ అనంతరం హత్య కేసు కొలిక్కి!
- మార్చి 24న విజయవాడలో హత్య
- కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు
- ఎదురింట్లో ఉన్న మహిళే నిందితురాలు
అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురికాగా, దాదాపు 8 నెలల పాటు కేసును విచారించిన పోలీసులు, నరాలను తెంపే క్రైమ్ థ్రిల్లర్ వంటి హత్యాకుట్రను వెలుగులోకి తెచ్చారు. మృతదేహాన్ని 12 గంటల పాటు ఇంట్లోనే ఉంచి, ఒక్క ఆధారమూ లేకుండా చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది... మృతురాలి ఎదురింట్లో ఉంటున్న మరో మహిళే కావడం గమనార్హం.
విజయవాడ క్రైమ్ డీసీపీ బి.రాజకుమారి వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అజిత్ సింగ్ నగర్ సమీపంలోని ఫార్చ్యూన్ హైట్స్ అపార్టుమెంట్లలో పేరం నాగమణి ఒంటరిగా ఉంటోంది. ఆమె కుమారులు, కుమార్తెలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. మార్చి 24న ఆమె హత్యకు గురి కాగా, కుమారుడు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును హ్యాండిల్ చేసిన సీసీఎస్ పోలీసులు అప్పట్లో అన్ని కోణాల్లో విచారించినా, చిన్న ఆధారం కూడా లభించలేదు. పోలీసు కుక్కలు సైతం ఏమీ కనిపెట్టలేదు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అపార్టుమెంట్ సీసీటీవీ ఫుటేజ్ లను జాగ్రత్తగా పరిశీలించగా, హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటల సమయంలో ఆమె ఇంటికి ఎదురింట్లో ఉండే ఆసియా బేగం అనే మహిళ బురఖాతో 7 గంటలకు బయటకు వెళ్లి, బురఖా లేకుండా 8.30 గంటల సమయంలో రావటం గమనించి అనుమానపడ్డారు. వెళ్లేటప్పుడు బ్యాగు, కర్రల సంచీతో వెళ్లిన ఆమె, వచ్చేటప్పుడు బ్యాగ్, మడతపెట్టిన కర్రల సంచీతో వచ్చిందని గమనించి నిఘా పెట్టారు.
ఆమె గురించి విచారిస్తే, రూ. 30 లక్షల వరకూ అప్పులున్నాయని, గతంలో ఆమె ఒకరిపై కాల్ మనీ కేసు పెట్టిందని తెలిసింది. అప్పటికీ ఆమె హత్యకు పాల్పడిందన్న అనుమానాలు పోలీసుల్లో బలంగా లేవు. ఆమెపై చింతలపూడి పీఎస్ లో మోసం కేసు ఒకటి నమోదై ఉందని తెలుసుకున్నారు పోలీసులు,
తాజాగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మార్చి 21న ఆసియా బేగం తన భర్తతో గొడవ పడగా, ఆపై రెండు రోజులకు వచ్చిన నాగమణి, గొడవ విషయమై ప్రశ్నించింది. ఇద్దరూ తిట్టుకున్నారు. కోపంతో ఆసియాబేగం, నాగమణిని బలంగా గోడకు నెట్టడంతో ఆమె కింద పడిపోయింది.
దీంతో ఆమెను బెడ్ రూమ్ లో ఉంచి తాళం పెట్టిన ఆసియా బేగం, మధ్యాహ్నం తరువాత వెళ్లి చూడగా, చనిపోయి కనిపించింది. దీన్ని దొంగల పనిగా చూపాలన్న ఉద్దేశంతో, ఆమె మెడకు ఉరిబిగించింది. ఆపై అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆమె వద్ద ఉన్న ఆమె ప్లాట్ తాళాలతో ప్లాట్ తెరచి, మృతదేహాన్ని ఇంట్లో పడేసింది. తన ఇంటిని, నాగమణి ఇంటిని శుభ్రంగా కడిగింది. 23న తల్లి కనిపించక పోవడంతో రెండు సార్లు వచ్చి చూసెళ్లిన కుమారులు, 24న వచ్చి చూసేవరకు మృతదేహం కనిపించగా, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆపై 24న ఉదయం స్కూటీపై వెళ్లిన ఆమె, బురఖాను కాలువలో పడేసి వచ్చింది. నాగమణి దగ్గర కాజేసిన నగలను తనఖా పెట్టింది. ఆపై ఏప్రిల్ 4న తన అపార్ట్ మెంట్ ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఆమెపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. నిన్న సత్యనారాయణపురం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను అరెస్ట్ చేయగా, నాగమణి గాజులు బయటపడ్డాయి. ఆపై విచారించగా, కేసు వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చింది.