Crime News: ఇంటి దొంగ... భర్తపై కోపంతో సొంతింటిలోనే నగదు, బంగారం అపహరణ!
- మరిదితో కలిసి దొంగతనం చేసి చోరీ కట్టు కథ
- సామాన్లు చిందర వందరచేసి సీన్ సృష్టి
- ప్లాన్ ఫెయిలై పోలీసులకు చిక్కిన గృహిణి
సొంతింటికే కన్నంవేసి, చోరీ కట్టు కథ అల్లి, అందుకు అనుగుణంగా సీన్ క్రియేట్ చేసిన ఓ గృహిణి వేసిన ఎత్తుగడ ఫెయిల్ కావడంతో పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతోంది. హైదరాబాద్ మహా నగరంలోని సికింద్రాబాద్ పరిధి రెజిమెంటల్ బజార్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రెజిమెంటల్ బజార్‌కు చెందిన సాయికుమారి అలియాస్ సునీత (31), వేణుగోపాల్ దంపతులు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరితో పాటు సునీతకు వరుసకు మరిది అయ్యే శివకుమార్ (28) ఉంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసే భర్త మద్యానికి బానిసగా మారడంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.
దీపావళి ముందు భర్తతో గొడవపడిన సునీత పిల్లల్ని, మరిదిని తీసుకుని మల్కాజ్‌గిరిలో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లిపోయింది. ఈనెల 7న దీపావళి రోజు వేణుగోపాల్ కూడా ఇంటికి తాళం వేసి అడ్డగుట్టలో ఉండే తల్లి వద్దకు వెళ్లిపోయాడు. అప్పటికి ఇంట్లో రూ.10,59,334 నగదు, కొంత బంగారం ఉంది. భర్తపై కోపంతో ఉన్న సునీత ఈ మొత్తాన్ని దొంగిలించాలని మరిది శివకుమార్‌తో కలిసి పథకం వేసింది. భర్త ఇంట్లో లేని విషయాన్ని గమనించి శివకుమార్, అతని తమ్ముడితో కలిసి సొంతింట్లోనే చోరీ చేయించింది.
ఘటనా స్థలిలో నిందితులు కారంపొడి చల్లి వెళ్లిపోయారు. కాగా, ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో ఈనెల 9వ తేదీన చుట్టుపక్కల వారు వేణుగోపాల్‌కు సమాచారం అందించారు. హడవుడిగా వచ్చిన వేణుగోపాల్ నగదు, బంగారం కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే విషయాన్ని భార్యకు కూడా తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి కారంపొడి తదితరాలను గమనించి ఎవరో తెలిసిన వారి పనేనని అనుమానించి నిఘా పెట్టారు.
భర్త ద్వారా సమాచారం అందుకున్న సునీత కూడా ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చి ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందాక తల్లి వద్దకు తిరిగి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి వస్తున్నానని భర్తకు చెప్పి తల్లివద్ద నుంచి వచ్చింది. శివకుమార్‌తో కలిసి బయటకు వచ్చిన ఆమె ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
భార్య, పిల్లలు కనిపించకపోవడంతో వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. సునీత కనిపించకపోవడంతో పోలీసుల అనుమానం ఆమెపైకి వెళ్లింది. ఆమె పుణెలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడిందిి. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.8.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ పరారీలో ఉన్నాడు.