Amritsar: నిర్లక్ష్యమే ఆ 60 మంది ప్రాణాలు తీసింది.. అమృత్‌సర్ రైలు ప్రమాదంపై తేల్చి చెప్పిన నివేదిక
- ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
- రైల్వే తప్పు ఎంతమాత్రమూ లేదు
- భవిష్యత్తులో మరోమారు జరగకుండా చర్యలు తీసుకోవాలి
దసరా రోజు అమృత్‌సర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తు నివేదిక సంచలన విషయం వెల్లడించింది. రావణ దహనాన్ని వీక్షిస్తున్న ప్రజలపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై రైల్వే భద్రత విభాగం చీఫ్ కమిషనర్ ఎస్‌కే పాఠక్ మధ్యంతర నివేదికను విడుదల చేశారు. ప్రమాదంలో రైల్వే నిర్లక్ష్యం ఎంతమాత్రమూ లేదని, ప్రజల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఆ మార్గంలో ‘ఎస్’ మలుపు ఉండడం వల్ల ప్రమాద ఘటనకు 250 మీటర్ల దూరం వరకు వచ్చే వరకు అక్కడేం జరుగుతుందో డ్రైవర్‌కు కనిపించదని పేర్కొంది.
అక్టోబరు 19 సాయంత్రం 6:55 గంటలకు అమృత్‌సర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జౌరా-ఫాటక్ వద్ద ప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రజలు రావణ దహనాన్ని చూస్తూ పట్టాలపై నిల్చున్నారని వివరించింది. ప్రమాదంలో 60 మంది మృతి చెందారని, ఈ ఘోర దుర్ఘటనకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంది. రైల్వే లైన్ సమీపంలో ప్రజలు వ్యవహరించే తీరులోనే పొరపాటు ఉందని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.