Supreme Court: జైళ్లలో అందుతున్న సకల సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- కొబ్బరినీళ్ల నుంచి ఎల్ఈడీ టీవీ సౌకర్యాలు
- విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు
- సోఫాల్లో కూర్చుని.. టీవీ చూసి ఆనందిస్తున్నారు
నేడు సుప్రీంకోర్టు జైళ్ల శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించని జైళ్లశాఖ.. కొందరికి మాత్రం కొబ్బరినీళ్ల నుంచి ఎల్ఈడీ టీవీ సౌకర్యాలు కల్పిస్తోంది. దీనిపై సుప్రీం మండిపడింది. ముఖ్యంగా గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్న యూనిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జైళ్లలో జరుగుతున్న అక్రమాలపై ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ఒక నివేదికను తయారు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతిరోజూ జైళ్లలో నిందితులకు అందుతున్న సౌకర్యాలపై కథనాలు వస్తున్నాయని.. బీహార్, తమిళనాడు తదితర ప్రాంతాల్లో నిందితులు మొబైల్ ఫోన్లు వాడుతూ అన్ని వ్యవహారాలు జైళ్ల నుంచే నడిపిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది. సంజయ్, అజయ్‌లకు జైల్లో కొబ్బరినీళ్లు, మినరల్ వాటర్, ఎల్ఈడీ టీవీ తదితర నిషేధిత వస్తువులను సమకూర్చినట్టుగా వచ్చిన ఫిర్యాదులపై సెషన్స్ జడ్జి విచారించారు.
‘‘తీహార్ జైల్లో నిందితులు సోఫాల్లో కూర్చుని.. టీవీ చూసి ఆనందిస్తున్నారు. ఇంకా వాళ్లకు ఏమేం అందుతున్నాయో భగవంతుడికే తెలియాలి...’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు సామాన్యులకు కనీస సౌకర్యాలు అందకపోవడంపై కేంద్రాన్ని సుప్రీం నిలదీసింది. జైళ్ల నిర్వహణ మొత్తాన్ని సరదాగా తీసుకుంటున్నారని.. కొన్ని జైళ్లలో సామాన్య ఖైదీలు ఎలా బతుకుతున్నారో పరిశీలించమని కేంద్రానికి మొట్టికాయలు వేసింది.