Andhra Pradeshch: బాబు పాలనలో ఆంధ్రాను చూసి అమెరికా, చైనాలు ఈర్ష్యతో కుళ్లుకుంటున్నాయి!: విజయసాయిరెడ్డి

  • రాష్ట్ర ప్రతిష్ఠను బాబు ఎవరెస్టుకు చేర్చారు
  • ఈ జబ్బేంటో అర్థం కాక డాక్టర్లు బిత్తరపోతున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన వేర్వేరు కార్యక్రమాలు, పథకాలపై ఈ రోజు ఆయన విమర్శనాత్మకంగా స్పందించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్నిరంగాల్లో టాపర్ గా నిలిచిందని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. పుష్కరాలు, ఉత్సవాలు, జల హారతులు, బోట్‌ రేసులతో రాష్ట్ర ప్రతిష్ఠ ఎవరెస్ట్‌ స్థాయికి చేరిపోయిందని ఎద్దేవా చేశారు. 3డీ గ్రాఫిక్స్‌ రాజధానిగా ప్రసిద్ధి చెందిన అమరావతికి ప్రపంచ పటంలో సింగపూర్‌ పక్కనే చోటు దొరికిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో చంద్రబాబు పాలనపై సంతృప్త స్థాయి 100% దాటేసిందని సెటైర్ వేశారు. కృష్ణదేవరాయల పాలనను తలపించే విధంగా మారిన ఆనంద ఆంధ్రప్రదేశ్‌ను చూసి.. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనాలు ఈర్ష్యతో కుళ్లుకుంటున్నారని పరోక్షంగా విమర్శించారు.

పగటి నిద్రలో నిప్పు నాయుడి ప్రేలాపనలు చూసి ఇది ఏం జబ్బో తెలియక డాక్టర్లు సైతం బిత్తరపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. కాగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, ప్రజలను నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిన చంద్రబాబు దేశాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు ఇస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఓ సూడో మీడియా ప్రజాస్వామ్యవాదని దుయ్యబట్టారు.

Andhra Pradeshch
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Twitter
criticise
  • Loading...

More Telugu News