Tamilnadu: అచ్చం ప్రణయ్ కేసు లాంటిదే... ముగింపు మరింత బాధాకరం!

  • పెళ్లికి అంగీకరించిన అబ్బాయి తల్లిదండ్రులు
  • ఒప్పుకోని అమ్మాయి తరపు పెద్దలు
  • స్నానానికి వెళ్లిన యువకుడి హత్య
  • విషయం తెలిసి యువతి ఆత్మహత్య

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య వంటి ఘటనే తమిళనాడులో జరుగగా, తన ప్రియుడి మరణాన్ని తట్టుకోలేని ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరునల్వేలి జిల్లా కేంద్ర సహకార సంఘ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇసక్కి శంకర్, వెల్లంగుళి ప్రాంతానికి చెందిన తలవాయ్ కుమార్తె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి పెళ్లికి శంకర్ తల్లిదండ్రులు అంగీకరించగా, ఆమె కుటుంబీకులు మాత్రం అంగీకరించలేదు. ఆ అమ్మాయి బీకామ్ ఫైనలియర్ చదువుతుండగా, చదువు పూర్తయిన అనంతరం పెళ్లి జరిపించేందుకు శంకర్ తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన బైక్ పై చెరువు వద్దకు కార్తీక స్నానికి శంకర్ వెళ్లిన వేళ, అతడిని చుట్టుముట్టిన కొందరు ఆయుధాలతో దాడి చేయగా, అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్యను శంకర్ ప్రియురాలి తండ్రే చేయించాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తన ప్రియుడు మరణించాడని తెలుసుకున్న ఆమె, తీవ్ర మనస్తాపానికి గురై గంటల వ్యవధిలోనే ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. బుధవారం ఉదయం ఎంత పిలిచినా బిడ్డ తన గది నుంచి బయటకు రాకపోవడంతో, తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆప్పటికే ఆమె విగతజీవిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామంలో ఘర్షణలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, విచారణ ప్రారంభించారు.

Tamilnadu
Honor Killing
Lover
Marriage
  • Loading...

More Telugu News