kyama mallesh: కారెక్కేందుకు సిద్ధమవుతున్న క్యామ మల్లేశ్... రేపో, ఎల్లుండో టీఆర్‌ఎస్ తీర్థం?
- ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మల్లేశ్
- ఈ స్థానం టీడీపీకి కేటాయించడంతో కుట్ర జరిగిందని ఆరోపణలు
- చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ తెరవెనుక మంత్రాంగం
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ 'చేతి'ని వదిలి కారెక్కేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం స్థానాన్ని టీడీపీకి కేటాయించిన విషయం తెలిసిందే.
దీంతో నిరాశ చెందిన మల్లేశ్ తనకు టికెట్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. పైగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోని ఓ నేత తనయుడు తనకు టికెట్టు కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్పింగ్ కూడా విడుదల చేశారు. దీంతో క్యామ మల్లేశ్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్ఠానం అతన్ని డీసీసీ పదవి నుంచి తప్పించింది.
ఈ పరిణామాలను గమనించిన టీఆర్‌ఎస్ ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడించి పార్టీలో భవిష్యత్తుపై ఆయనతో చర్చించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై మల్లేశ్ స్పందిస్తూ ఇంకా తానెటువంటి నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల్లో అంతా తెలుస్తుందన్నారు.