Telangana: టీఆర్ఎస్ నేతలు ఊర్లో అడుగుపెడితే చెప్పులు చూపండి!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్ నిర్వాకంతో అల్లుడు-బిడ్డ ఇళ్లకు రావడంలేదు
- ప్రగతి భవన్ కట్టి బతుకమ్మ ఆడుతున్నాడు
- మునుగోడులో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత
టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజవర్గం అభివృద్ధికి చేపట్టిన పనులు శూన్యమని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇంటికి అల్లుడు వస్తే ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారనీ, కానీ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో అల్లుడు-బిడ్డ ఇంటికి రావడమే మానుకున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నేలపట్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజగోపాల రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించలేని సీఎం కేసీఆర్, రూ.100 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకుని కొడుకు, కోడలు, అల్లుడు.. అందరితో కలసి బతుకమ్మ ఆడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం పేదలకు ఇళ్లు ఇవ్వని టీఆర్ఎస్ నేతలను ఊర్లలో అడుగుపెట్టనివ్వవద్దని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఊర్లో అడుగులు పెడితే చెప్పులు చూపించాలన్నారు.
కుక్కకు బిస్కెట్లు పడేసినట్లు ప్రజలకు నగదు పడేసి తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. మునుగోడులో తనను ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.