Pakistan: పాకిస్తాన్ కు షాకిచ్చిన అమెరికా.. రూ.9 వేల కోట్ల భారీ సాయం నిలిపివేస్తూ ఉత్తర్వులు!
- ఉగ్రపోరులో విఫలమైన పాక్
- పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదు
- ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ కు మరోసారి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్ సరిగ్గా వ్యవహరించడం లేదంటూ రూ.9,260 కోట్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదుల నిర్మూలనలో పాక్ వైఖరి మారకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు అబోటాబాద్ లో రహస్యంగా పాక్ ఆశ్రయం ఇచ్చిందని అమెరికా దుయ్యబట్టింది.
‘ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్ నేతలు అమెరికాకు చెప్పారు. కేవలం మాటలే కానీ ఆ దిశగా పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోలేదు. దీనివల్ల పాక్ పొరుగు దేశాలు నష్టపోతున్నాయి. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా సహకారాన్ని నిలిపివేయడం పాక్‌కు గట్టి హెచ్చరిక లాంటిది.
తాలిబన్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై ఒకవేళ పాక్ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్గానిస్థాన్‌లోనూ శాంతి పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల భారత్ తో సత్సంబంధాలు ఏర్పడతాయి’ అని అమెరికా రక్షణశాఖ అధికారి డేవిడ్ సిడ్నీ తెలిపారు. పాక్-అఫ్గాన్ సరిహద్దులో రెచ్చిపోతున్న హక్కానీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోనందుకు రూ.2,136 కోట్ల సాయాన్ని ఇప్పటికే నిలిపివేసింది. ఉగ్రవాదుల నిర్మూలనలో పాక్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే అమెరికా రక్షణశాఖ పాక్ పై కొరడా ఝుళిపించడం గమనార్హం.