kcr: తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తాం.. ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలో చెబుతాం: కేసీఆర్

  • రెండేళ్లలో సిద్ధిపేట మీదుగా రైలు వెళ్తుంది
  • వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ. 10వేలు ఇస్తాం
  • ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం

తెలంగాణ ఏర్పడితే ఎన్నో సమస్యలు వస్తాయని ఎందరో ఎన్నో మాటలు అన్నారని... వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ, రాష్ట్రాన్ని ఉన్నతపథంలోకి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రెండేళ్లలో సిద్ధిపేట మీదుగా రైలు ప్రయాణిస్తుందని తెలిపారు. సిద్ధిపేట నుంచి హరీష్, దుబ్బాక నుంచి రామలింగారెడ్డి లక్ష మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రైతులు ఎంత నాశనం అయ్యారో తనకు తెలుసని... రైతులకు అప్పులు లేకుండా ఉన్నప్పుడే వాళ్ల జీవితాలు బాగున్నట్టని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ. 10వేలు ఇస్తామని చెప్పారు. సిద్ధిపేట బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు, కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తామని... ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనేది అధికారులు చెబుతారని... అక్కడ ఆ పంటలు మాత్రమే వేయాలని చెప్పారు. అప్పుడే మనం పండించిన పంటలకు డిమాండ్ పెరిగి, సంపాదన ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వ్యవసాయ యూనివర్శిటీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్క వస్తువు కల్తీనేనని... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మనకు మంచి వస్తువులు లభిస్తాయని చెప్పారు. ఈ యూనిట్లను మహిళా సంఘాలే నిర్వహిస్తాయని తెలిపారు. ఈ యూనిట్లలో ప్రాసెస్ చేసిన వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News